CWC Meeting | లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (Congress Working Committee meeting) కాబోతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అధ్యక్షతన జూన్ 8న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11:30 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. లోక్సభ ఎన్నికల తర్వాత సీడబ్ల్యూసీ తొలిసారి సమావేశం కానుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన, అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. మరికొన్ని రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతోంది. ఈనెల 8 లేదా 9వ తేదీన మూడో సారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మోదీ (PM Modi) ఈ సారి ఇతరులపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. 2014 తర్వాత తొలిసారి బీజేపీ మేజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేక పోయింది. మంగళవారం వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 292 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి నేతల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీయేకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా 234 సీట్లను కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో సొంతంగా 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుంది. గతంతో పోలిస్తే 47 సీట్లు ఎక్కువ సాధించింది.
Also Read..
YS Jagan | టీడీపీ దాడులతో ఏపీలో భయానక వాతావరణం : జగన్
Karti Chidambaram | చైనీస్ వీసా కేసు.. కార్తీ చిదంబరానికి బెయిల్
Naveen Patnaik | 24 ఏళ్ల పాలనపై సిగ్గుపడాల్సిన అవసరం లేదు.. ఓటమిపై నవీన్ పట్నాయక్ స్పందన