న్యూఢిల్లీ : రాహుల్ గాంధీపై నకిలీ వీడియోను పలువురు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుదారి పట్టించేలా తమ నేతపై నకిలీ వీడియోను పోస్ట్ చేసినందుకు ఆ పార్టీ నేతలు క్షమాపణ చెప్పకపోతే బీజేపీపై చట్టపరమైన చర్యలు చేపడతామని కాంగ్రెస్ హెచ్చరించింది.
రాహుల్ గాంధీపై ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోను బీజేపీ నేతలు ప్రచారంలో పెడుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు రాసిన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. వయనాద్లో తన కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటనపై రాహుల్ మాట్లాడగా దాన్ని కన్హయలాల్ హత్యపై మాట్లాడినట్టు ఆపాదిస్తూ నకిలీ వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపించారు.
ఇదే వీడియోను ఓ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిందని ఆక్షేపిస్తూ ఆ ప్రసార సంస్ధపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ వ్యవహారంపై బీజేపీ క్షమాపణ చెప్పాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీపై ఫేక్ వీడియోను ప్రచారంలో పెట్టినందుకు బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోర్టుల చుట్టూ తిరిగేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా హెచ్చరించారు.