(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌పాలిత కర్ణాటక స్కామ్‌లకు కేంద్రబిందువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై ముడా భూకుంభకోణం ఆరోపణలు రావడం, ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్)లో కోట్ల రూపాయలు చేతులు మారాయన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను మంగళవారం ఢిల్లీకి పిలిపించుకొన్న కాంగ్రెస్ అగ్రనేతలు వారితో ఏకాంతంగా భేటీ అయ్యి ఈ అంశాలపై ఆరా తీసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు ఉద్దేశపూర్వకంగా తమ సర్కారుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భేటీ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్ఠాన పెద్దలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. అయితే, ఏడాది గడువక ముందే ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు రావడం మంచిదికాదని, త్వరగా సమస్యను సరిదిద్దాలని అగ్రనేతలు కన్నడ నాయకులకు సూచించినట్టు సమాచారం.
ముడా భూ పంపిణీ వివాదంపై వివరణ ఇవ్వాలంటూ సీఎం సిద్ధరామయ్యను కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ కోరారు. ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలని, స్కామ్‌లో భాగమైన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఈ నెల 25న బీజేపీ నేతలు గవర్నర్‌కు ఓ మెమోరాండమ్‌ను సమర్పించారు. ఈ క్రమంలోనే గవర్నర్.. ముఖ్యమంత్రి స్పందన కోరినట్టు రాజ్‌భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కాగా, గవర్నర్ పదవిని బీజేపీ రాజకీయంగా వాడుకొంటున్నదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
మైసూరు శివారుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాల 16 గుంటల భూములు ఉన్నాయి. అయితే, అవసరాల దృష్ట్యా ఆ భూములను సేకరించిన ప్రభుత్వం.. వాటికి బదులుగా నగరంలోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకొనే విజయనగర్, దట్టగల్లీ, జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచయా-సతాగల్లీలో సిద్ధరామయ్య కుటుంబానికి భూములను కేటాయించింది. 50:50 నిష్పత్తిలో (పడావు పడ్డ ఒక ఎకరా తీసుకొంటే, అభివృద్ధి చేసిన అర్ధ ఎకరం ఇవ్వడం) ఈ భూముల కేటాయింపు జరిగింది. అయితే, సిద్ధరామయ్య కుటుంబానికి అత్యంత ఖరీదైన ప్రాంతాలలో రూ.4 వేల కోట్ల విలువజేసే ఆ భూములను కేటాయించాలని ఎవరు సిఫారసు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్నే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్‌గా చెప్తున్నారు. వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్ పీ చంద్రశేఖరన్ గత మే 26న ఆత్మహత్య చేసుకోవడంతో ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం వెలుగు చూసింది. వాల్మీకి కార్పొరేషన్ నుంచి పలు బ్యాంకు ఖాతాలకు చట్ట విరుద్ధంగా రూ.187 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని చంద్రశేఖరన్ తన సూసైడ్ నోటులో పేర్కొనడం గమనార్హం. ఈ స్కామ్‌లో ప్రభుత్వపెద్దల హస్తం ఉన్నదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.