Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 68 స్థానాలకు నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్‌లో.. కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 34, బీజేపీ 30 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. హిమాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 35. రెండు పార్టీలూ స్వల్ప ఆధిక్యంలో ఉండటంతో హస్తం పార్టీ వ్యూహాలకు పదునుపెట్టింది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలను అప్పుడే ముమ్మరంచేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ప్రయత్నాలను అడ్డుకునేందుకు కొత్త ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలను కాపాడుకునే బాధ్యతను చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాలు నెత్తికెత్తుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రత్యేక బస్సులో గురువారం సాయంత్రానికి రాజస్థాన్ తరలించనున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగతంగా దీనిని పర్యవేక్షిస్తున్నారని, ఈ రోజు ఆమె సిమ్లా చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
హిమాచల్‌లో మొత్తం 412 అభ్యర్థులు పోటీ చేశారు. దీంట్లో 24 మంది మహిళలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 75.60 శాతం ఓట్లు పోలయ్యాయి. 2017లో ఆ రాష్ట్రంలో 75.57 శాతం ఓట్లు పడ్డాయి. ఒకరకంగా హిమాచల్ ఫలితాలు కాంగ్రెస్‌కు మళ్లీ ఉత్తేజాన్ని ఇవ్వనున్నాయి. ఆ పార్టీ ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.