న్యూఢిల్లీ : ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మెగా ర్యాలీని నిర్వహిస్తోందని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ భారీ ర్యాలీని ప్రారంభిస్తారని చెప్పారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం ఈ ర్యాలీతో ముగియబోదని, సెప్టెంబర్ ఏడు నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర చేపట్టామని చెప్పారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై మోదీ ప్రభుత్వం స్పందించడం లేదని, కేంద్ర ప్రభుత్వ అజెండా కేవలం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనని మండిపడ్డారు. 2021 నుంచి కాంగ్రెస్ పార్టీ ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పోరాడుతున్నదని చెప్పారు.
ఆదివారం జరిగే ర్యాలీకి పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు తరలిరావాలని వేణుగోపాల్ కోరారు. ధరల పెరుగుదల పోరాటాన్ని పార్లమెంట్ నుంచి వీధులకు తీసుకువెళుతున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన కార్పొరేట్ స్నేహితుల బాగు కోసం కార్పొరేట్ పన్నులు తగ్గిస్తూ సామాన్యుడిపై భారం మోపేలా జీఎస్టీ రేట్లను పెంచుతున్నారని ఆరోపించారు.