ముంబై, జనవరి 7: మహారాష్ట్ర థాణె జిల్లాలోని అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాలు స్థానిక రాజకీయాల్లోనే కాదు మహారాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని గడచిన అనేక ఏండ్లుగా బలంగా వినిపిస్తున్న బీజేపీ.. అంబర్‌నాథ్‌లో అధికారం కోసం కాంగ్రెస్‌తోనే జతకట్టడం సంచలనం సృష్టించింది. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనను దూరం పెట్టేందుకు వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌తో బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్) చేతులు కలపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. అధికారం కోసం రెండు పార్టీలు దిగజారడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో అంబర్నాథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమేగాక, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరినీ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.
అంబర్నాథ్ వికాస్ అఘాడీ పేరిట బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ(అజిత్ పవార్) జతకట్టాయి. 14 మంది బీజేపీ కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, నలుగురు ఎన్సీపీ(అజిత్ పవార్) కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్‌తో కలసి మున్సిపల్ కౌన్సిల్లో మెజారిటీ సాధించి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని ఈ కూటమి భావించింది. ఈ కూటమి మద్దతుతో బీజేపీ నాయకురాలు తేజస్వీ కరంజులే మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన(షిండే వర్గం) అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ పదవికి ఆ పార్టీని దూరం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలపడం వివాదాస్పదమైంది.
దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్ అంబర్నాథ్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేయాలని ఆదేశించారు. తమకు తెలియకుండా స్థానిక నాయకత్వం ఈ తప్పుడు చర్యకు పాల్పడిందని ఆయన ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు బీజేపీ కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. స్థానిక బీజేపీ నాయకులు ఎవరైనా సొంతంగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే అది తప్పుడు నిర్ణయమని, ఆ వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆ పొత్తును రద్దు చేయవలసిందిగా ఆదేశిస్తామని కూడా ఆయన చెప్పారు.