న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం, దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ సీనియర్లు షాక్ ఇచ్చారు. యుద్ధం విషయంలో వారు రాహుల్‌తో విభేదించడమే ఇందుకు కారణం. దీంతో హస్తం పార్టీ తీరుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నది. విదేశాంగ విధానంలో ప్రధాని రాజీ పడ్డారని రాహుల్ ఇటీవల విమర్శించారు. అయితే దీనికి విరుద్ధంగా ‘విదేశాంగ విధానంలో కేంద్రం బాధ్యతాయుతంగా రాజనీతిని ప్రదర్శించిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవల ట్వీట్ చేశారు.
మరోవైపు యుద్ధ ప్రభావం మన దేశంపై పడి సంక్షోభంగా మారకముందే కేంద్రం పరిణితి కలిగిన ఆలోచన, నైపుణ్యంతో పని చేస్తున్నదని మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ మోదీ సర్కారును ప్రశంసించారు. దేశంలో ఎల్పీజీ, పెట్రో ఇంధనాలకు కొరత లేదని.. ప్రజల్లో ఏర్పడిన భయాందోళన వల్లే సరఫరాలో ఆలస్యమవుతున్నదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు.
యుద్ధం విషయంలో కేంద్రం సరైన నిర్ణయాలను తీసుకుంటున్నదని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. ‘దేశంలో ఇంధన కొరత లేదని విపక్షంలోని సీనియర్ నాయకులే అంగీకరించారు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఇంధనం విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నది’ అని జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు.