నాందేడ్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (Vasant Chavan) కన్నుమూశారు. 70 ఏండ్ల గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 13న శ్వాస సంబంధిత సమస్యతో నాందేడ్‌లోని ఓ దవాఖానలో చేరారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వాయుమార్గంలో తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నైగావ్‌లో జన్మించారు వసంత్ చవాన్. సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1978లో నాయ్‌గావ్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. 2002లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009-2014 వరకు నైగావ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021- 2023 వరకు నాందేడ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం నాందేడ్ లోక్ సభ నియోజకవర్గానికి వసంత్ చవాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖాలికర్పై 59,442 ఓట్ల తేడాతో గెలుపొందారు.