శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో (J&K Assembly elections) నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ మద్య సీట్ల వివాదం కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌కు కశ్మీర్ లోయలో ఐదు సీట్లు, జమ్మూ ప్రాంతంలో 28 నుంచి 30 సీట్లను ఎన్సీ ఆఫర్ చేసింది. అయితే ఎన్సీకి పట్టున్న స్థానాలతో సహా మరికొన్ని సీట్లను కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి ఎన్సీ ప్రతిపాదించింది. అయినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకులు దీనిని అంగీకరించలేదు.
కాగా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్ట్ 27. అయితే ఎన్సీ, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందం, అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఇరు పార్టీలు డైలామాలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్సీతో సీట్ల పంపకంపై చర్చల్లో అడ్డంకులను తొలగించేందుకు కాంగ్రెస్ ట్రబుల్షూటర్లను శ్రీనగర్‌కు పంపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్ కలిసి ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో సమావేశమవుతారు. సీట్ల ఒప్పందంలో ఏర్పడిన విభేదాలను తొలగించేందుకు చర్చలు జరుపనున్నారు.
మరోవైపు దీనికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కలిసి ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడంపై ఒక అంగీకారానికి వచ్చారు.