బెంగళూరు: రైతుల ఆత్మహత్యల్లో కాంగ్రెస్ పాలిత కర్ణాటక దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు కర్ణాటకలో 2,809 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ చెలువరాయస్వామి శాసనసభకు వెల్లడించారు. బెళగావిలో జరుగుతున్న శీతాకాల శాసనసభ సమావేశాల సందర్భంగా బీజేపీ సభ్యుడు అరవింద్ బెల్లాడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,254 మంది, 2024-25లో 1,178 మంది 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 377 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం రైతు ఆత్మహత్యల్లో కర్ణాటక దేశంలో రెండో స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. అయితే, గడచిన మూడేండ్లలో పోలిస్తే ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయని ఆయన అన్నారు. హవేరీ జిల్లాలో అత్యధికంగా 297 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా బెళగావిలో 259 మంది, కలబురగిలో 234 మంది, ధార్వాడ్లో 195 మంది, మైసూరులో 190 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా, రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తప్పుపట్టారు.