బెంగళూరు, అక్టోబర్ 25: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధ్వానమైన రోడ్లు, గుంతలు పడ్డ దారులు..వాహనదారుల ప్రాణాలను బలి గొంటున్నాయి. బెంగళూరుకు సమీపంలో గుంతలతో కూడిన రోడ్డు శుక్రవారం బైక్పై వెళ్తున్న ఓ బ్యాంక్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. బైక్పై వెనుకాల కూర్చొని ప్రయాణిస్తున్న ఆమె, రోడ్డుపై గుంత కారణంగా ఎగిరి పక్కకు పడిపోయింది. అదే సమయంలో ఓ ట్రక్ దూసుకురాగా..ఆమె అక్కడికక్కడే ప్రా ణాలు కోల్పోయింది. హస్కర్-మకాలీ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతురాలిని ఆలూర్కు చెందిన 26 ఏండ్ల ప్రియాంక కుమారిగా గుర్తించారు.
రోడ్డు సరిగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు స్వయంగా వెల్లడించారు. సోదరుడు నరేశ్ నడుపుతున్న బైక్పై ప్రియాంక మాదవరా మెట్రో స్టేషన్కు బయల్దేరినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. గుంతలతో కూడిన రోడ్డు వల్లే తన సోదరిని కోల్పోయానని నరేశ్ బోరున విలపించాడు. రాష్ట్రంలో అధ్వాన రోడ్లపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేసినా కాంగ్రెస్ పాలకులు మేల్కొనటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సెప్టెంబర్లో ఇలాగే బుడిగేరే క్రాసింగ్ వద్ద 20 ఏండ్ల కాలేజీ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలింది. మరోవైపు వారంలోగా బెంగళూరులోని రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చి వేయాలని సీఎం సిద్ధరామయ్య ఈ నెల 21న అధికారులను ఆదేశించారు.