PM Cares Fund | పీఎం కేర్ నిధుల విషయంలో పారదర్శకత ఏదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కరోనా మహమ్మారి వచ్చి నాలుగేండ్లు దాటినా ఇప్పటికీ ‘పీఎం కేర్స్’ను ఎందుకు ఏర్పాటు చేశారో స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ప్రశ్నించారు.
‘ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెలుగు చూడటంతో బీజేపీ సర్కార్ దోపిడీ, అవినీతి బయటకు వస్తున్నది. కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం తెరిచిన మరో మార్గం మర్చిపోవద్దు. అదే పీఎం కేర్స్. దీనికొచ్చిన విరాళాలు, విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. పీఎం కేర్స్ నిధికి సుమారు రూ.12,700 కోట్ల నిధులు వచ్చాయని మీడియాలో ప్రచురితమైన కథనాలను బట్టి తెలుస్తున్నది. అందులోనూ ఎక్కువ కొన్ని కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చినవే ఉన్నాయి’ అని జైరాం రమేశ్ చెప్పారు.
పీఎం కేర్స్ నిధికి రూ.వందల కోట్లలో విరాళాలు ఇస్తామని కార్పొరేట్ కంపెనీలు బహిరంగ ప్రకటనలు చేశాయని జైరామ్ రమేశ్ గుర్తు చేశారు. 38 ప్రభుత్వ రంగ సంస్థలు రూ.2,105కోట్ల విరాళాలు అందజేశాయని, ఇటువంటి విరాళాలకు ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించిందని, అయినా, ఆ వివరాలు వెల్లడించకపోవడం శోచనీయం అని ఆరోపించారు.