Pinarayi Vijayan : కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ.. బీజేపీ బీ టీమ్ అని విమర్శించారు. శనివారం ఒక మీడియా సంస్థతో మాట్లాడిన విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశంలోని అనేక మంది ప్రతిపక్ష నేతలు, నాయకులపై కేసులు నమోదు చేస్తూ, అరెస్టులు చేస్తున్నారని, కానీ, కేరళ సీఎం పినరయి విజయన్ను మాత్రం ప్రశ్నించడం లేదని విమర్శించారు.
ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీపై విజయన్ ఫైర్ అయ్యారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ, మైనారిటీ, మెజారిటీ అంటూ దేశంలో మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల ముగ్గురు సీపీఐ (ఎం) పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అండతో ఇండిపెండెంట్లుగా పోటీ చేయడంపై విజయన్ స్పందించారు. కొందరు పార్లమెంట్‌కు వెళ్లాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. వాళ్లు ఎంతోకాలంగా నిర్మించుకున్న రాజకీయ వారసత్వాన్ని చెడగొట్టుకుంటున్నారని అన్నారు.
ప్రతిపక్షాలతో చేతులు కలిపి తమ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారని విమర్శించారు. కేరళలో సీపీఐ (ఎం) పార్టీకి చెందిన సీఎం పినరయి విజయన్ ఇతర పార్టీలతో కలిసి ఎల్డీఎఫ్ కూటమిగా పోటీ చేస్తున్నారు. 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి.