న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా మరో గ్రామాన్ని నిర్మిస్తోందని వచ్చిన వార్తలపై ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత, సమగ్రతలతో రాజీ పడుతోందని ఆరోపించింది. చైనా గ్రామంగా చెబుతున్న ఫోటోలను కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మీడియాకు ప్రదర్శిస్తూ మోదీ సర్కార్ తీరును దుయ్యబట్టారు.
వీర సైనికుల త్యాగాలను మోదీ సర్కార్ అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చైనా దూకుడుతో ముందుకెళుతున్నా భారత్ ఎందుకు సహనంతో భరిస్తోందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. డ్రాగన్ హద్దుమీరుతున్న నేపధ్యంలో ప్రధాని మోదీ మౌనం వీడి సరిహద్దుల్లో జరుగుతున్న విషయాలపై ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.