Congress party : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) పై కాంగ్రెస్ పార్టీ (Congress party) కి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రదాడి విషయంలో నేతలు గీత దాటొద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆదేశించారు. పార్టీ అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశ ప్రతిష్టకు వ్యతిరేకంగా ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు.
ఈ మేరకు పార్టీ నేతలు పలువురికి ఆదేశాలు జారీచేశారు. పహల్గాం దాడి దేశ ఐక్యత, సమగ్రతపై జరిగిన ప్రత్యక్ష దాడి అని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. పహల్గాం దాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై తీసుకుంటున్న కఠిన చర్యలను కొందరు కాంగ్రెస్ నేతలు తప్పుబట్టడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌ను కించపరిచేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పాకిస్థాన్ తమ మీడియాలో ప్రసారం చేసుకుంటోందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
శత్రువుల ముందు దేశాన్ని తక్కువ చేసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తమ సొంత పార్టీ నేతలను నియంత్రించలేరా..? అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఉగ్రదాడి తర్వాత ప్రపంచం మొత్తం భారత్‌కు మద్దతుగా నిలిచిందని, కానీ మనలో ఉన్నవారే మనకు వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. జాతీయ ఐక్యతపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలన్నీ ఉత్తివేనా..? అని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులు ప్రజలను చంపే ముందు వారి మతం గురించి అడిగి ఉండరని కర్ణాటక మంత్రి ఆర్బీ తిమ్మాపుర్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఉగ్రదాడితో తనకు సంబంధం లేదని పాకిస్థాన్ చెబుతున్నా సింధూ జలాలను ఆపివేయడం సమంజసం కాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ సోజ్ ఇటీవల వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో తాగునీటి అవసరాలకు, వ్యవసాయానికి నీరు చాలా ముఖ్యమని, సింధూ జలాలను పాక్‌కు మళ్లించకపోతే పంజాబ్, జమ్మూకశ్మీర్ పూర్తిగా మునిగిపోతాయని ఆయన అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా మొదలైన కాంగ్రెస్ నేతలు పాక్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకమాండ్ నేతలను కంట్రోల్లో పెట్టేందుకు ఆదేశాలు ఇచ్చింది.