న్యూఢిల్లీ, జూన్ 6: ఇటీవల బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని తమ పార్టీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని ఆరాటపడుతున్నది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మారాలని కలలు కంటున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ, లోక్సభ మాజీ డిప్యూటీ లీడర్ అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) క్రమేపీ కనుమరుగవుతున్నదని, ఎందుకంటే ఆ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక భావనల మీదే బలపడిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయి పూర్తిగా బలహీన పడటాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటానికి ఇది బంగారు అవకాశమని వ్యాఖ్యానించారు.
టీఎంసీ.. కమ్యూనిస్ట్ వ్యతిరేక భావజాలంపై పుట్టిన పార్టీ అని, దశాబ్దాలుగా పాలిస్తున్న కమ్యూనిస్టులను అధికారానికి దూరం చేయడంలో ఆ పార్టీ పూర్తిగా కృతకృత్యమైందని, అయితే ఆ పార్టీకి సైద్ధాంతిక పునాది లోపించిందని అన్నారు. గత కొన్నేండ్లుగా ఆ పార్టీ గూండాయిజం, రాజకీయ హింస, ప్రజాకర్షక ధోరణిని అవలంబిస్తున్నదని, వీటిని నమ్ముకున్న పార్టీ ఏదో ఒక రోజు కుప్పకూలక తప్పదని, ఈ విషయాన్ని తాను చాలానాళ్ల క్రితమే ఊహించానని ఆయన తెలిపారు. టీఎంసీ ఒక స్వల్పకాలిక అద్భుతమని, ఎందుకంటే దానికి రాజకీయ సిద్ధాంతం లేదని, దానిని పార్టీలా కన్నా ఒక ప్రైవేట్ క్లబ్లా నిర్వహించారని ఆరోపించారు. అందుకే ఎంత వెలుగు వెలిగిందో చివరకు అంతే వేగంగా మసకబారిపోయిందని అన్నారు.
కాంగ్రెస్ బలపడటానికిదే మంచి అవకాశం
రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పటిష్టం అయ్యేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నాయని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. తమ పార్టీకి పటిష్ఠ వ్యవస్థ లేకపోయినప్పటికీ రాష్టమంతటా ఉనికి ఉందన్నారు. కొన్ని దశాబ్దాలుగా తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా మద్దతుదారులు అంతటా ఉన్నారని తెలిపారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో తాము పార్టీ సిద్ధాంతాలను ఓటర్లలోకి విస్తృతంగా తీసుకుపోయి వారి విశ్వాసాన్ని పొందాలని, మెల్లగా ప్రతిపక్షం స్థానాన్ని ఆక్రమించాలని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అడుగుపెట్టడానికి, ఆ పార్టీ ఎదగడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కారణం టీఎంసీయేనని, అందుకే ఆ పార్టీ ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నదని అన్నారు. బీజేపీకి దగ్గరైతే వారికి ఉన్న ముస్లిం మద్దతు ఓట్లు దూరమవుతాయన్న విషయాన్ని రెబల్ ఎమ్మెల్యేలు గ్రహించాలన్నారు.
మరికొందరు ఎమ్మెల్యేల తిరుగుబాటు తథ్యం ; టీఎంసీలో అసమ్మతిపై రితబ్రత బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్లో విస్తృత అవినీతి ఉన్నదని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ శనివారం ఆరోపించారు. పార్టీలో ఇటీవల పెల్లుబికిన అసమ్మతికి ఎంపీ అభిషేక్ బెనర్జీయే కారణమని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరికొందరు నాయకులు తిరుగుబాటు శిబిరంలో చేరవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం 61 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. జూన్ 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపల ఈ సంఖ్య(తిరుగుబాటు ఎమ్మెల్యేలు) పెరగడం ఖాయం అని ఓ వార్తాచానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 80 స్థానాల్లో గెలుపొందగా అందులో 61 మంది రితబ్రత సారథ్యంలోని తిరుగుబాటు వర్గంలో చేరారు. అయితే పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. పార్టీలో అంతర్గత తిరుగుబాటుకు అభిషేక్ బెనర్జీనే ప్రధాన కారణమని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత అభిషేక్ బెనర్జీకి నిలబడి చప్పట్లు కొట్టి గౌరవించాలని మే 6న మమతా బెనర్జీ తన నివాసంలో జరిగిన సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారని రితబ్రత తెలిపారు.