Shashi Tharoor | కొచ్చి: ప్రధాని మోదీని, కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని పొగడటం వివాదాస్పదమైన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. తాను ఇప్పటికీ పార్టీకి అందుబాటులోనే ఉన్నానని చెబుతూనే వార్నింగ్ ఇచ్చారు. తన అవసరం లేదని పార్టీ భావిస్తే తనకూ వేరే ఆప్షన్లు ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు ‘ఐఈ మలయాళం’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. కేరళ ప్రభుత్వ స్టార్టప్ పాలసీని, ప్రధాని మోదీ యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడంపై ఇటీవల తన ఆర్టికల్‌లో శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఆయన స్పందించారు. ‘కేరళ కాంగ్రెస్‌లో నాయకత్వ శూన్యత ఉంది. ఈ విషయమై నా అభిప్రాయాలను పార్టీ ఇతర నేతలూ సమర్థించారు. కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ తన బేస్‌ను విస్తరించాల్సిన అవసరముంది. రాష్ట్ర నాయకత్వ రేసులో నేను అందరికంటే ముందున్నాను. కొన్ని సంస్థల పోల్‌లో ఈ విషయం స్పష్టమైంది. కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని విస్తరించకపోతే వచ్చే ఎన్నికల్లో మూడోసారి ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుంద’ని స్పష్టం చేశారు.