Rahul Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) స్పీకర్ (Speaker) ఓం బిర్లా (Om Birla) తీరుపై మండిపడ్డారు. స్పీకర్ సభ నడుపుతున్న తీరు సరిగ్గా లేదని, ఇది అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. సభలో ఏం జరుగుతుంతో తనకు అర్థం కావడంలేదని, ఎన్నిసార్లు అభ్యర్థించినా స్పీకర్ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. బుధవారం సరైన కారణం లేకుండా స్పీకర్ సభను వాయిదా వేశారని విమర్శించారు.
తాను మాట్లాడేందుకు ఎప్పుడు లేచి నిలబడ్డా స్పీకర్ మాట్లాడనివ్వడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కనీసం మాట్లాడనివ్వకపోతే తమ వాయిస్‌ను ఎలా వినిపించాలని ఆయన ప్రశ్నించారు. తనను ఒక్క ముక్క కూడా మాట్లాడనివ్వలేదని ఆరోపించారు. గడిచిన ఏడు ఎనిమిది రోజులుగా స్పీకర్ తన విషయంలో ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇది ప్రభుత్వ కొత్త వ్యూహమని, సభలో ప్రతిపక్షాలకు చోటులేదని విమర్శించారు.
ఇటీవల లోక్‌సభలో ప్రధాని మోదీ కుంభమేళాపై ప్రసంగం చేసినప్పుడు కూడా తాను మాట్లాడేందుకు ప్రయత్నించానని, అప్పుడు కూడా స్పీకర్ తనకు అనుమతి ఇవ్వలేదని రాహుల్‌గాంధీ ఆరోపించారు. స్పీకర్ ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ప్రతిపక్ష నేత రూల్ 349కు అనుగుణంగా నడుచుకుంటారని భావిస్తున్నామంటూ స్పీకర్ సభను వాయిదా వేయడాన్ని రాహుల్‌గాంధీ తప్పుపట్టారు. రూల్ 349కు విరుద్ధంగా తాను ఏం చేశానని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ కుంభమేళాపై ప్రసంగిస్తుండగా తొక్కిసలాటలో మరణించిన వారి గురించి ప్రస్తావించాలంటూ ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారని, కానీ ప్రధాని తొక్కిసలాట మృతులకు కనీసం సంతాపం కూడా తెలియజేయలేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. పైగా స్పీకర్ రూల్ 372ని విధించారని, ఈ రూల్ ప్రకారం ప్రధానిగానీ, మంత్రిగానీ మాట్లాడుతున్నప్పుడు ఇతర సభ్యులు ఎలాంటి ప్రశ్నలు వేయకూడదని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఉంటుందని, కానీ వీళ్లు మాత్రం తనను మాట్లాడనివ్వడంలేదని ఆరోపించారు.