Congress MP : కేంద్ర ప్రభుత్వం లోక్సభలో గురువారం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మతపరమైన అంశాలు చాలా సున్నితమైనవని, వీటికి సంబంధించిన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవని తాము ప్రభుత్వానికి సూచిస్తామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ తీరు చూస్తుంటే కాషాయ పాలకులకు ఏ ఒక్కరి సంక్షేమం పట్టదని ఆరోపించారు.
మహారాష్ట్ర, హరియాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజకీయాలపై ఫోకస్ పెట్టిందని అర్ధమవుతున్నదని గగోయ్ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లు, 2024ను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కాగా, ఈ బిల్లును రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు.
ఈ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా చేర్చే నిబంధనను తీసుకొస్తున్నారని అన్నారు. ఇది మత స్వేచ్ఛపై నేరుగా చేపట్టిన దాడేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు విరాళంగా ఇచ్చిన భూములను తిరిగి తీసుకునేందుకు మీరెవరని ఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ ప్రశ్నించారు. మొదటి నుంచి ప్రభుత్వ ఉద్దేశం ఇదేనని అన్నారు. బీజేపీ తన పేరును మార్చుకోవాలని, ఆ పార్టీని భారత భూములను లాగేసుకుని వారికి ఇష్టమైన వారికి పంచే పార్టీగా పిలవాలని అన్సారీ వ్యాఖ్యానించారు.
Read More :
Misa Bharti | నిరుద్యోగం, ధరల మంట ఊసెత్తని మోదీ సర్కార్ : ఆర్జేడీ ఎంపీ