బెంగళూరు, నవంబర్ 29: దేశంలో క్షేత్ర స్థాయి నుంచి ఏఐసీసీ స్థాయి వరకు పార్టీలో ప్రక్షాళన జరుగుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రకటన కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి దించేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
ఈ క్రమంలో సీఎం సన్నిహితుడు, ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సిద్ధరామయ్య మార్పుపై ఎలాంటి చర్చలు జరగడం లేదని పేర్కొన్న ఆయన సీఎం మార్పు అధిష్ఠానం చేతిలో ఉందని అనడం గమనార్హం.
ఎమ్మెల్యేలెవరూ సిద్ధరామయ్యను మార్చాలని కోరుకోవడం లేదని, అయితే సిద్ధరామయ్య దిగిపోవాలని అధిష్ఠానం నిర్ణయిస్తే మనమేం చేయగలమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర కూడా సీఎం, కేపీసీసీ అధ్యక్షుని మార్పు ఉండొచ్చని సంకేతాలిచ్చారు.