న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో ఆదివారం అన్ని రాష్ర్టాల్లో ధర్నాలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద నిరసన చేపట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో మహాత్మాగాంధీ మెమోరియల్ బయట నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ.. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అహంకారి, పిరికివాడు అని అభివర్ణించారు. నిరంకుశ పాలకుడికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. అహంకారపూరిత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని పెంచే సమయం వచ్చేసిందని అన్నారు. ‘దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మా కుటుంబం ఏం చేయడానికైనా సిద్ధమే’ అని వెల్లడించారు.
వాళ్లను తిడితే బీజేపీకి నొప్పెందుకు?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ‘ఇప్పుడు బీజేపీ ఓబీసీ అని మాట్లాడుతున్నది. లలిత్ మోదీ ఓబీసీనా? నీరవ్ మోదీ ఓబీసీనా? మెహుల్ ఛోక్సీ ఓబీసీనా? ప్రజా ధనాన్ని లూటీ చేసి పారిపోయారు. వాళ్లను తిడితే బీజేపీకి నొప్పి ఎందుకు? దేశానికి సేవ చేస్తున్న వ్యక్తికి శిక్ష విధిస్తూ, లూటీ చేసినవారిని విదేశాలకు పంపింది’ అని విమర్శించారు. వివిధ రాష్ర్టాల్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేపట్టాయి.
డిస్”క్వాలిఫైడ్’ ఎంపీగా ట్విట్టర్ స్టేటస్
లోక్‌సభ అనర్హత వేటు వేయటంతో రాహుల్ గాంధీ తన నిరసనను వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ బయోగ్రఫీలో డిస్”క్వాలిఫైడ్’ ఎంపీ అని రాసుకున్నారు.
ఆ సంప్రదాయానికి మోదీయే తిలోదకాలిచ్చారు
దేశ అంతర్గత రాజకీయాలను కొందరు వ్యక్తులు విదేశాల్లో ప్రస్తావిస్తూ పరువు తీస్తున్నారంటూ కేంద్ర మంత్రి జైశంకర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్ ప్రసంగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మొదట ఆ సంప్రదాయాన్ని మరచిన వ్యక్తే జయశంకర్‌ను మంత్రిని చేశారని మోదీని ఉద్దేశించి విమర్శించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ సందర్భంగా ప్రధాని మోదీని ప్రస్తావిస్తూ ‘దేశంలోని రాజకీయాల గురించి బయటిగడ్డపై ప్రస్తావించరాదన్న చిరకాలపు సంప్రదాయానికి ఒక వ్యక్తి తిలోదకాలిచ్చారు, అయనే జయశంకర్‌ను మంత్రిని కూడా చేశారు’ అని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 2015లో విదేశాల్లో చేసిన విమర్శలను ప్రస్తావించారు. అయితే వాటిని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేరని విమర్శించారు.