బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Karnataka Elections) కొనసాగుతున్నది. అధికార బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకివ్వడంతో కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతున్నది. హస్తం పార్టీ అభ్యర్థులు 117 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక అధికారాన్ని దక్కించుకోవాలంటే ప్రధానమైన మైసూరు (Mysore) ప్రాంతంలో కాంగ్రెస్ దూసుకుపోతున్నది. పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 61 స్థానాలు ఉన్నాయి. అక్కడ 34 సీట్లలో చెయ్యి గుర్తు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో ఇప్పటివరకు జేడీఎస్‌కు (JDS) కంచుకోటగా ఉన్న పాత మైసూర్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ పాగావేసింది. 22 స్థానాలో జేడీఎస్ రెండో స్థానంలో ఉండగా, కేవలం 3 స్థానాలతో బీజేపీ మూడో ప్లేస్‌కు పరిమితమైంది.
కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాలు, కోస్తాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపారు. కోస్టల్ కర్ణాటక, బెంగళూరులో అధికార బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోగా, హైదరాబాద్ కర్ణాటక, నార్త్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇక 15 కార్పొరేషన్లు, 75 నగర పంచాయతీల్లో కాషాయ పార్టీ ఆధిక్యంలో ఉన్నది.
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్