(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఈడీ ఆరోపించింది. సోనియా, రాహుల్ ఆదేశాల ప్రకారమే ఇదంతా జరిగినట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని స్థానిక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ తన వాదనను వినిపించింది.
విచారణ సందర్భంగా ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. ఏజేఎల్‌కు లాభాలు రానప్పటికీ, ఆ సంస్థ పరిధిలో రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు రాజు గుర్తు చేశారు. అయితే, రోజూవారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏజేఎల్ ప్రతినిధులు రూ. 90 కోట్ల మేర అప్పు తీసుకొన్నట్టు తెలిపారు. అయితే ఆ రుణాలను వసూలు చేసుకొనే హక్కును కాంగ్రెస్ రూ. 50 లక్షలకే యంగ్ ఇండియన్ అనే కంపెనీకి బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ యంగ్ ఇండియన్ కంపెనీలోనే సోనియా, రాహుల్‌కు 76 శాతం షేర్లు ఉన్నాయని ఎస్వీ రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలా సోనియా, రాహుల్ ప్రధాన భాగస్వాములైన యంగ్ ఇండియన్ కంపెనీ కేవలం రూ. 50 లక్షలు చెల్లించి, రూ. 2,000 కోట్ల విలువైన ఏజేఎల్ సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని పేర్కొన్నారు. అలా మొత్తంగా రూ. 90 కోట్ల రుణం ఇచ్చి.. దానికి ప్రతిఫలంగా రూ. 2 వేల కోట్ల ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే యంగ్ ఇండియన్ కంపెనీని కుట్రపూరితంగా సృష్టించారని తెలిపారు. తగినన్ని ఆధారాలు లభించిన తర్వాత ఈ కేసులో కాంగ్రెస్ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేరుస్తామని కోర్టుకు తెలిపారు.
ఏజేఎల్‌కు ఇచ్చిన రుణాల విషయంలోనూ అవకతవకలు జరిగినట్టు ఈడీ ఆరోపించింది. విరాళాల పేరిట ప్రజల నుంచి సేకరించిన సొమ్మును వాణిజ్య అవసరాలకు ఉద్దేశించిన కంపెనీలో కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టు విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. ఈ క్రమంలో అద్దె, ఇతరత్రాల రూపంలో రూ. 142 కోట్లను సోనియా, రాహుల్ అయాచితంగా లబ్ధి పొందారని మరోసారి గుర్తు చేసింది. కాంగ్రెస్ అగ్రనేతల సూచనల ప్రకా రం.. ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఏజేఎల్‌తో నకిలీ ఆర్థిక లావాదేవీలను కూడా జరిపినట్టు పేర్కొంది. ఈ కేసులో రాహుల్, సోనియాతో పాటు శామ్‌పిట్రోడా, సుమన్ దూబే తదితరులు కూడా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు తెలిపింది. ఈడీ దాఖలు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. జూలై 8 వరకూ ప్రతీరోజూ ఈ కేసును విచారిస్తామని వెల్లడించింది.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గత మేలో ఈడీ కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ కంపెనీకి సీఎం రేవంత్ 2019-22 మధ్య విరాళాలు ఇప్పించారని అందులో వెల్లడించింది. ఇదే విషయమై అదే నెలలో జాతీయ మీడియా ఇండియా టుడే ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. యంగ్ ఇండియన్ కంపెనీకి విరాళాలు ఇవ్వాల్సిందిగా అప్పటి తెలంగాణ పీసీసీ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2019-22 మధ్య తెలంగాణకు చెందిన నలుగురు కాంగ్రెస్ నేతలకు సూచించినట్టు ఇండియా టుడే పేర్కొంది. దీంతో రేవంత్ ఆదేశాలతో యంగ్ ఇండియన్ కంపెనీకి 2022 జూన్‌లో రూ. 80 లక్షల మేర విరాళాలను ఈ నలుగురు ఇచ్చినట్టు వెల్లడించింది. విరాళాలు ఇచ్చిన వారి జాబితాలో 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన గాలి అనిల్ కుమార్ (రూ. 20 లక్షలు), మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ (రూ. 20 లక్షలు), అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర కోశాధికారి పీ సుదర్శన్ (రూ. 15 లక్షలు), అప్పటి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఓ వ్యక్తి రూ. 25 లక్షలను ఇచ్చినట్టు ఈడీ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక పేర్కొంది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఈ విరాళాలన్నీ యంగ్ ఇండియన్ కంపెనీకి చేరినట్టు వివరించింది.