లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా లక్నోలోని ఆమె నివాసానికి వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె భద్రతా సిబ్బంది ఆ నేతలను లోపలికి అనుమతించకుండా వెనుకకు పంపేశారు. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి లోనయిన కాంగ్రెస్ అధిష్టానం ఈ భేటీకి ఎలాంటి అధికారిక అనుమతి లేదని స్పష్టం చేస్తూ, సదరు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మంగళవారం కాంగ్రెస్ నేత రాజేంద్రపాల్ గౌత మ్, బారాబంకీ ఎంపీ తనుజ్ పుని యా లక్నోలోని మాయావతి నివాసానికి చేరుకుని, ఆమెతో సమావేశం కావాలని కోరారు. అయితే ఆమె వారిని కలిసేందుకు నిరాకరించారు. ఆ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడుతూ మాయావతి యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చామని తెలిపారు.