చెన్నై : కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పక్కనపెట్టాలని వ్యాఖ్యానించిన పార్టీ తమిళనాడు ప్రతినిధి, ఏఐసీసీ సభ్యుడు అమెరికై నారాయణన్‌పై వేటు పడింది. అగ్రనేతలను విమర్శించిన నారాయణన్‌ను పార్టీ నుంచి తొలగించారు.
ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్‌ను తిరిగి ప్రజలకు చేరువ చేసేందుకు గతంలో పార్టీని వీడిన మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్‌లోకి రప్పించాలని నారాయణన్ సూచించారు. ఆయా పార్టీలను కాంగ్రెస్‌లో విలీనమయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ దిశగా ప్రయత్నాలు చేపడితే పార్టీ తిరిగి పటిష్టమవుతోందనే సంకేతాలను బాగస్వామ్య పక్షాలకు పంపే అవకాశం ఉంటుందని అన్నారు. మమతా బెనర్జీ తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తే ఆమె ఇతరులకు సర్ధిచెప్పగలరని పేర్కొన్నారు.
గాంధీల నాయకత్వాన్ని బాహాటంగా వ్యతిరేకించిన దక్షిణాది నేత నారాయణన్ ఒక్కరే కావడం గమనార్హం. ఆయన అసంతృప్త నేతల గ్రూప్ జీ-23లో సభ్యుడు కూడా కాదు. రాష్ట్రానికి సీఎంగా ఉండి ప్రధాని పదవి రేసులో ఉన్న మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో ఎందుకు చేరతారని ప్రశ్నించగా తృణమూల్ కాంగ్రెస్‌లో కంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆమె ప్రధాని పదవిని చేపట్టవచ్చని నారాయణన్ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ ముందుండి పార్టీని నడిపించాలని అయితే ఆమె సంతానాన్ని మాత్రం పక్కనపెట్టాలని ఆయన స్పష్టం చేశారు.