న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాలను కేంద్ర ప్రభుత్వం కూలదోస్తోందని మండిపడ్డారు. మౌనం దేశ సమస్యలను పరిష్కరించదనే పేరుతో ఓ వార్తా పత్రిక సంపాదకీయంలో మోదీ సర్కార్‌పై సోనియా విరుచుకుపడ్డారు. కీలక సమస్యలు, సున్నిత అంశాలను వదిలివేయడం లేదా ఘాటైన పద ప్రయోగాలతో ఆయా అంశాల నుంచి పక్కకు తప్పుకోవడం మోదీ ప్రకటనలు ప్రస్ఫుటం చేస్తాయని సోనియా మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్ధలోని మూడు స్తంభాలను ధ్వంసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక అంశాలు, అదానీ కుంభకోణం, బడ్జెట్ వంటి అంవాలపై చర్చను మరుగునపడేసేందుకు, విపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం దారుణమని ఆమె మండిపడ్డారు.
విపక్షాలు సమైక్యంగా ప్రభుత్వంపై పోరాడుతుండటంతో విపక్షాన్ని నిలువరించేందుకు కేంద్రం అసాధారణ చర్యలతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో పాటు ఆయన ప్రసంగంలోని కొంత భాగాన్ని పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడాన్ని సోనియా ప్రస్తావించారు.
పార్లమెంట్లో ఎలాంటి చర్చా చేపట్టకుండా రూ. 45 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారని దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని, ఈడీ, సీబీఐ కేసుల్లో 95 శాతం విపక్ష నేతలపైనే బనాయిస్తున్నారని సోనియా గాంధీ మండిపడ్డారు. కాషాయ పార్టీలో చేరిన నేతలపై కేసులు మాత్రం ఆవిరవుతున్నాయని ఆరోపించారు.
Read More