Shashi Tharoor : అమెరికా ప్రధాని మోదీని, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుని భారత్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. అమెరికాపై బీజేపీ చేసిన ఆరోపణలు ఆ పార్టీ నేతల కుటిల మనస్తత్వాలను తెలియజేస్తున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రవర్తన భారత్‌కు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్నారు.
బీజేపీకి ప్రజాస్వామ్యం, దౌత్యం అంటే ఏమిటో అర్థం కావడంలేదనే సంగతి స్పష్టమవుతోందని, వారు పూర్తిగా చిల్లర రాజకీయాల్లో కూరుకుపోయారని శశిథరూర్ మండిపడ్డారు. బీజేపీ నేతల దగ్గర ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించే లక్షణాలు లేవని విమర్శించారు. బీజేపీ నేతలు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని, కీలక దేశాలతో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి మన దేశానికి ఇబ్బందికరమని చెప్పారు.
భారత దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు అమెరికాలోని కొన్ని శక్తులు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీతో కుమ్మక్కయ్యాయని ఇటీవల బీజేపీ ఆరోపించింది. దీనిపై అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. బీజేపీ నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం శోచనీయమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛగా తమ దేశం మారుపేరుగా ఉందని తెలిపింది.