Rahul Gandhi | న్యూఢిల్లీ, జూన్ 6: స్వతంత్ర భారతంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అన్నారు. దీని వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన మంగళవారం (జూన్ 4న) దేశీయ స్టాక్ మార్కెట్లు అత్యంత భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. అయితే దీన్నో భారీ స్కామ్‌గా రాహుల్ పేర్కొన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు తేలాలంటే విచారణ జరిగి తీరాల్సిందేనన్నారు.
ఇటీవలి స్టాక్ మార్కెట్ల నష్టాలు.. చిన్న మదుపరులకు పెద్ద నష్టాలనే మిగిల్చాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు అమిత్ షా, మోదీ.. ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది తామేనని, జూన్ 4న స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకుంటాయని, మదుపరులు స్టాక్స్‌ను పెద్ద ఎత్తున కొనాలంటూ సలహాలిచ్చారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే 5 కోట్ల రిటైల్ మదుపరులు తమ కష్టార్జితాన్ని కోల్పోయారని ఇక్కడ విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఆ ఒక్కరోజే మదుపరుల సంపద రూ.31 లక్షల కోట్లు పడిపోయిందని చెప్పారు. ‘స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని మదుపరులకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎందుకు సలహా ఇచ్చారు. ఈ రకమైన సలహాలు ఇవ్వడం ఏమైనా వాళ్ల పనా? ఇద్దరూ ఒకే బిజినెస్ గ్రూప్ (అదానీ గ్రూప్?) నకు చెందిన ఒకే మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ అంతా పెట్టుబడులు పెట్టాలని కోరారు.
జూన్ 1న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోసమని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ మే నెలలో పలుమార్లు అటు అమిత్ షా, ఇటు మోదీ.. విజయం మాదేనని, ఫలితాల రోజున స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిల్లో పరుగులు పెడుతాయని ప్రగల్భాలు పలికారని రాహుల్ విమర్శించారు. దీనివల్ల తమ సన్నిహితుల స్టాక్స్‌కు లాభం చేకూర్చేలా కుట్రకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలిసారి ప్రధాని స్టాక్ మార్కెట్ల ప్రస్తావన పదేపదే తెచ్చారని, దాంతో లేని బూమ్ వచ్చిందన్నారు. .
జూన్ 4న ఏర్పడ్డ స్టాక్ మార్కెట్ నష్టాలపై ఈడీతో దర్యాప్తు చేపట్టాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజిత్ సేథ్‌కు రాసిన లేఖలో మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. ఈ భారీ నష్టాలతో చిన్న మదుపరులు కుదేలయ్యారని, ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆ రోజు నష్టాలు రికవరీ కాలేదన్నారు. దీని వెనుక ఉన్న కారణాలు తెలియాలన్నారు.
అక్రమ పద్ధతిలో స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసేలా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విచారణ జరుపాలని అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) డిమాండ్ చేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతోనే జూన్ 3న మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని, జూన్ 4న అంతా నష్టపోయారని సెబీకి రాసిన తన లేఖలో టీఎంసీ నేత సాకెత్ గోఖలే ఆరోపించారు.