Pawan Khera : కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నది. ఈ కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగి ఐదు రోజులు అయినప్పటికీ, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నది. కేసు డైరీని సాయంత్రంలోగా, ఇతర డాక్యుమెంట్లను బుధవారం ఉదయం 10 గంటల్లోగా సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. నిర్భయ ఘటన అనంతరం కఠిన చట్టాలు తీసుకురావడంతో పరిస్ధితి మెరుగుపడుతుందని అనిపించినా, కథువా, ఉన్నావ్, హథ్రాస్, లలిత్ పూర్ వంటి ఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయని, దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగుచూడటం విచారకరమని అన్నారు. కోల్‌కతా ఘటన దారుణ ఉదంతమని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు ప్రజలను ఆరోగ్యంగా ఉండేలా శ్రమిస్తుంటే మనం వారి భద్రతను కాపాడలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.
రాజకీయ పార్టీలన్నీ ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కఠిన చట్టాలున్నా ఇలాంటి నేరాలు సమాజంలో ఎందుకు పెరుగుతున్నాయనేది చర్చించాలని సూచించారు. కోల్‌కతా ఘటనపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదని, కథువ, ఉన్నావ్, హథ్రాస్‌లో రేపిస్టులకు మద్దతుగా నిలిచిన వీరికి ఈ కేసులో నోరు మెదిపే నైతిక హక్కు లేదని అన్నారు. మీరేం చేశారో తెలుసుకుని ఆపై మాట్లాడాలని బీజేపీ నేతలకు పవన్ ఖేరా హితవు పలికారు.
Read More :
Hardik Pandya: బ్రిటీష్ సింగర్‌తో డేటింగ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా !