న్యూఢిల్లీ, మార్చి 18: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ యూటర్న్ తీసుకొన్నారు. జీ-23 గ్రూపు కాస్త మెత్తబడింది. పార్టీలో ప్రక్షాళన జరగాలని, నాయకత్వంలో మార్పు రావాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న ఆజాద్.. తాజాగా ‘కాంగ్రెస్లో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదు. నాయకత్వంతో సమస్య లేదు’ అన్నారు. సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగడం అందరికీ సమ్మతమేనన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. సోనియాతో సమావేశం బాగా జరిగిందని, పార్టీని బలోపేతం చేయడంపై పలు సూచనలు ఇచ్చానని ఆజాద్ విలేకరులకు చెప్పారు. ఏం సూచనలు చేశారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.