భోపాల్: ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షా (Vijay Shah) తప్పిపోయారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఆయన గురించి సమాచారం ఇస్తే రూ.11,000 ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్లు ఏర్పాటు చేశారు. కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఎక్కడా కనిపించడం లేదని ఇండోర్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు వివేక్ ఖండేల్వాల్ విమర్శించారు. కేబినెట్ సమావేశాల్లో కూడా ఆయన కనిపించడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి విజయ్ షా తప్పిపోయినట్లు భావించి పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు వివేక్ తెలిపారు. ఆయన సమాచారం తెలిపిన వారికి బహుమతిగా రూ.11,000 ఇస్తామని చెప్పారు. మంత్రి పదవికి విజయ్ షా రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ ఆందోళన చేస్తూనే ఉంటుందని అన్నారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి విజయ్ షా వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా మంత్రి విజయ్ షాను మందలించింది. ఈ అంశంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.