Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోడీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో పలువురు నేతలు రాజ పటేరియాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పటేరియాపై పన్నాలోని పవాయ్ పోలీస్ స్టేషన్ లో నిన్న మధ్యాహ్నం పోలీసు కేసు నమోదయింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.