Karnataka | బెంగళూరు, మార్చి 20: కర్ణాటకలో విద్యుత్తు వినియోగదారులపై భారం పడనున్నది. ఏప్రిల్ 1 నుంచి ప్రతి యూనిట్‌కు అదనంగా 36 పైసల చొప్పున సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ(పీ అండ్ జీ) వాటాను విద్యుత్తు వినియోగదారుల నుంచి రాబట్టాలని విద్యు త్తు సరఫరా కంపెనీలను(ఎస్కామ్స్) కర్ణాటక విద్యుత్తు నియంత్రణ కమిషన్(కేఈఆర్సీ) ఆదేశించిన దరిమిలా ఈ నిర్ణయం వెలువడింది.
2026-27. 2027-28 ఆర్థిక సంవత్సరంలో పీ అండ్ జీ సవరించనున్నారు. వినియోగదారులు వరుసగా 35 పైసలు, 34 పైసలు ప్రతి యూనిట్‌కు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ వినియోగదారులపై పడనున్న అదనపు భారంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన వచ్చిన నాటి నుంచి ధరల పెంపు తప్ప మరో గ్యారెంటీ ఏదీ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న కర్ణాటకలో ముఖ్యమంత్రి నుంచి శాసనసభ్యుల వరకు అందరి జీతాలు రెట్టింపు కానున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లును శుక్రవారం రాష్ట్ర శాసనసభ ఆమోదించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడి జీతాలు, అలవెన్సులు, పింఛన్లు పెరగనున్నాయి.
ధరల పెరుగుదలతో సామాన్యుడు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నాడో తమ పరిస్థితి కూడా అంతేనని కర్ణాటక హెం మంత్రి జీ పరమేశ్వర జీతాల పెంపు ప్రతిపాదనను సమర్థించుకున్నారు. జీతాల పెంపు ప్రతిపాదనలు ఎమ్మెల్యేల నుంచి వచ్చాయని, దీనిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. అందరూ బతకాల్సిందేనంటూ పరమేశ్వర వ్యాఖ్యానించారు.