Rahul Gandhi : ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ప్రొటోకాల్ అంశంపై రాజకీయ వివాదం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ వేడుకల్లో మూడో వరుసలో సీటు కేటాయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. బీజేపీపై మండిపడింది. ఢిల్లీలో సోమవారం జరిగిన గణతంత్ర వేడుకలకు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.
నిబంధనల ప్రకారం, లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఆయనకు ముందు వరుసలో సీటు కేటాయించాలి. అయితే, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొదటి వరుసలో కూర్చోగా.. రాహుల్ గాంధీ మాత్రం ఆయన వెనుక మూడో వరుసలో కూర్చున్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీకి మూడో వరుసలో సీటు కేటాయించి, ఆయనను బీజేపీ ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ బీజేపీని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి హక్కుగా దక్కాల్సిన గౌరవం అందలేదని, ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని అన్వర్ విమర్శించారు.
ప్రతిపక్ష నేతకు ప్రత్యేక స్తానం ఉంటుందని, ఒక రకంగా చెప్పాలంటే షాడో ప్రధానిగా పరిగణిస్తారని అన్వర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలకమైన కార్యక్రమంలో ఇలా ప్రతిపక్ష నేతను గౌరవించకపోవడాన్ని అన్వర్ తప్పుబట్టారు. ఇటీవలి కాలంలో ఇలా తరచుగా జరుగుతోందన్నారు. ఎప్పటినుంచో అమలవుతున్న ప్రజాస్వామ్య విధానాల్ని మోదీ ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఈ వివాదంపై ఇంకా బీజేపీ స్పందించలేదు.