(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్‌మీటర్’ ఓ విఫల ప్రాజెక్టు అని.. రైతును, సామాన్యుడిని నష్టపరిచేందుకే తీసుకొచ్చిందని మండిపడ్డారు. కేసీఆర్ పోరాటానికి జడిసి కేంద్రం ‘స్మార్ట్ మీటర్’ విషయంలో వెనక్కి తగ్గింది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిందో రైతన్నలకు గోస మొదలైంది. ఎరువులు, కరెంటు సంక్షోభంతో ఇప్పటికే కుదేలైన రాష్ట్ర రైతాంగంపై రేవంత్ ప్రభుత్వం కొత్తగా ‘స్మార్ట్’ కుట్రలకు తెగబడుతున్నది. తెలంగాణలోని దాదాపు 5 లక్షల వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లను బిగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. స్మార్ట్‌మీటర్లపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ, దాన్నేమీ పట్టించుకోని రేవంత్ సర్కారు మీటర్ల బిగింపునకే మొగ్గు చూపుతున్నది. అయితే.. ఒకవైపు, తెలంగాణలో స్మార్ట్ కుట్రలకు స్థానిక కాంగ్రెస్ సర్కారు తాపత్రయపడుతుంటే, ఒడిశాలో మాత్రం అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఓ యుద్ధాన్నే ముందుకు తీసుకుపోతున్నారు. దీంతో ‘స్మార్ట్ మీటర్ల’పై కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి, రెండు రకాల పాలసీలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. 300 యూనిట్ల వరకూ ఇస్తామన్న ఉచిత కరెంటును అటకెక్కించారని ఒడిశాలోని అధికార బీజేపీ సర్కారుపై ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్‌దాస్ మండిపడ్డారు. ఉచిత విద్యుత్తు ఇవ్వకపోగా, వ్యవసాయ మోటర్లకు, ఇండ్లల్లోని విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో రైతులు ఇప్పటికే ఎంతో నష్టపోయారని ఆరోపించారు. స్మార్ట్‌మీటర్లను చూయించి ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట రైతులు, సామాన్యుల నుంచి వేల రూపాయలను దండుకోవడం ఏమిటని నిలదీశారు. మీటర్లు బిగించినప్పటి నుంచి రైతులకు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్మార్ట్‌మీటర్లను బిగించిన టాటా పవర్ సెంట్రల్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీసీవోడీఎల్) కంపెనీ ముందు వందలాది మంది కార్యకర్తలతో నిరసన కార్యక్రమాలను హోరెత్తించారు. రైతుల ప్రయోజనాలకు నష్టంచేసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల నిరసనలతో రాజధాని భువనేశ్వర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
ఒకవైపు స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా ఒడిశా కాంగ్రెస్ నేతలు నిరసనలను ఉద్ధృతం చేస్తుంటే, మరోవైపు తెలంగాణలో అన్నదాతల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతూ స్మార్ట్ కుట్రలకు తెగబడుతున్నది. రేవంత్ ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, గత కేసీఆర్ ప్రభుత్వం స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకించి అన్నదాతలకు అండగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా వాళ్లు గుర్తు చేస్తున్నారు. స్మార్ట్‌మీటర్ల ఇన్‌స్టాలేషన్‌పై ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం పునరాలోచించాలని, లేకపోతే అన్నదాతలు మరో ఉద్యమానికి దిగే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ర్టాల్లో పెల్లుబికిన స్మార్ట్ ఉద్యమాలను ఉదహరిస్తున్నారు.
స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా వివిధ రాష్ర్టాల్లో ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. వేలల్లో బిల్లులు వస్తున్న ఈ స్మార్ట్‌మీటర్లు తమకు వద్దంటూ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో ఉన్న రాథోడా గ్రామ రైతులు.. పశ్చిమ్ విద్యుత్ విట్రన్ నిగం లిమిటెడ్ (పీవీవీఎన్‌ఎల్) కార్యాలయం ముందు మీటర్లను కుప్పలుగా పోశారు. స్మార్ట్‌మీటర్లు బిగించినప్పటి నుంచి వారానికి రూ. 8 వేల దాకా బిల్లులు వస్తున్నాయని యూపీలోని ఉమర్పూర్ రైతులు ఆందోళనలను తీవ్రం చేశారు. బుధానా కరెంటు ఆఫీసులో మీటర్లను కుప్పలుగా పోసి నిరసనలు హోరెత్తించారు. వేలల్లో బిల్లులు వస్తున్న మీటర్లను ఊడబీకిన మీరట్ రైతులు.. విద్యుత్తు ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. ఏపీలోని శ్రీకాకుళంలో కూడా రైతుల గుండెలమీద స్మార్ట్చిచ్చు కుంపటిగా మారింది. ఇక, స్మార్ట్ మీటర్లు పెట్టినప్పటి నుంచి తమకు కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని నిరుడు బీహార్‌లోని నందలాల్‌పూర్, మిల్లీచక్, బహదూర్‌పూర్, ఐనాయత్పూర్, రోస్రా, సమస్తీపూర్ తదితర గ్రామాల ప్రజలు నిరసనలు తెలిపారు. యూపీవ్యాప్తంగా అమర్చిన 12 లక్షల స్మార్ట్‌మీటర్లు లోపాలపుట్టగా ఉన్నాయని, బిల్లులు ఎక్కువగా చూయిస్తున్నాయని 2023లో కేంద్ర విద్యుత్తుశాఖ చేపట్టిన పరిశీలనలోనూ తేలింది. ఇక, ‘స్మార్ట్‌మీటర్’ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌లోనూ అమలు చేయడానికి ప్రయత్నించింది. అయితే, తమ జేబులకు చిల్లు పెడుతున్న ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలంటూ కశ్మీర్‌లోని బుద్గామ్ ప్రజలు గత నెలలో నిరసన ప్రదర్శనలు చేశారు. గండెర్బాల్ జిల్లాలోనూ స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.