న్యూఢిల్లీ : క్రిస్మస్ పోయమ్స్‌ను నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యాలకు అన్వయించేలా మలుస్తూ కేంద్ర సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం చుక్కలు తాకడాన్ని ప్రస్తావిస్తూ “థ్యాంక్ గాడ్..శాంటా భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భరించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. జింగిల్ బెల్స్..జింగిల్ బెల్స్..జింగిల్ ఆల్ ది వే..మీ సేవింగ్స్ ఖాళీ కాకుండా వస్తవులు కొనడం ఎంతో తమాషా అంటూ ధరల మంటపై సర్కార్‌ను ఎద్దేవా చేస్తూ మరో ట్వీట్లో మండిపడింది.
ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఇటీవల జైపూర్‌లో మెగా ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక మరో ట్వీట్లో ఈ క్రిస్మస్కు ప్రజల బాధలు వినే ప్రభుత్వం కావాలని తాము కోరుకుంటున్నామని..మోదీ సర్కార్ మన్ కీ బాత్ మినహా ప్రజల సమస్యలను వినే పరిస్థితిలో లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు వాడివేడి విమర్శలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.