బడంగ్‌పేట: చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జా చెరలో చిక్కుకుంటున్నాయి. బాలాపూర్ మండల పరిధిలో 47 గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. ప్రసుతం ఒక చెరువుకు మరో చెరువుకు లింక్ కట్ అయిపోయింది. నాలాలు కబ్జా అయ్యాయి. తటాకాలు ఆక్రమణకు గురవుతున్నా.. కొన్ని నామరూపాలు లేకుండా పోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఎకరాల కొద్దీ చెరువులను ఇప్పటికే మింగేశారు. చెరువుల్లో రియల్ వ్యాపారాల జోరు సాగుతున్నది. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేస్తే వారు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
బాలాపూర్ మండల పరిధిలోని సుద్దమోని కుంట, ఎర్రకుంట, పోచమ్మ కుంట, కోమటి కుంట, బాలాపూర్ పెద్ద చెరువు, మీర్‌పేట పెద్ద చెరువు, జల్పల్లి పెద్ద చెరువు, మామిడిపల్లి, నాదర్‌గూల్‌లో ఉన్న సున్నం చెరువు, రెడ్డి చెరువు, మర్రి చెరువు, బీర చెరువు తదితర చెరువులు కబ్జా అవుతున్నాయని ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ సరిహద్దులను గుర్తించాల్సి ఇరిగేషన్ అధికారులు హద్దులు గుర్తిస్తే..ఏ చెరువు ఎంత ఉందో రెవెన్యూ ఇన్స్పెక్టర్ విస్తీర్ణం చెప్పిన తర్వాత..మండల సర్వేయర్ సర్వే చేయాల్సి ఉంటుంది. కానీ బాలాపూర్ మండల్‌కు సర్వేయర్ కొరత ఉంది. సర్వేయర్ లేని విషయాన్ని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు.. ఆ సాకు చూపించి తప్పించుకుంటున్నట్లు సమాచారం.
సమాచారం ఇవ్వడం లేదు
– తహసీల్దార్ ఇందిరా దేవి
ఇరిగేషన్ అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదు. కబ్జా అవుతున్నదని ఎవరికీ తెలియకుండా ఇన్‌వార్డులో ఇచ్చి పోతున్నారు. కనీసం ఫోన్ చేసి చెప్పడం లేదు. ఇదేం పద్ధతి. ఏ చెరువు కబ్జా అవుతున్నదో తర్వాత పరిశీలన లేదు. సర్వేయర్ కొరత ఉంది. చెరువులను రక్షించాల్సిన బాధ్యత ఉంది. గ్రామ పరిపాలన అధికారులను అప్రమతం చేస్తాం.