సంగారెడ్డి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఎవ్వరూ సంగారెడ్డి జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి దూరంగా ఉన్నారు. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్నప్పటికీ సీఎం ఎన్నికల ప్రచారానికి రాకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు జిల్లా పర్యటనకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినప్పటికీ ఆయన రాలేదు. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉంది.
దీంతోపాటు జిల్లా ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ఓడిపోతుందన్న సమాచారం ఉండడంతో రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ప్రచారానికి ఆసక్తి చూపలేదని తెలిసింది. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహా సైతం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదు. కేవలం తన నియోజకవర్గంలోని అందోలు-జోగిపేట మున్సిపాలిటీ ప్రచారానికే పరిమితమయ్యారు. సంగారెడ్డి మున్సిపాలిటీ మీదుగానే జోగిపేట పోయినప్పటికీ, కనీసం సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు ప్రాంత నాయకులు దామోదరను రావాల్సిందిగా కోరినప్పటికీ, ఆయన ప్రచారానికి వెళ్లలేదు. పటాన్చెరులో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు.
నియోజకవర్గ ఇన్చార్జి కాటాశ్రీనివాస్‌గౌడ్, మరోనేత నీలంమధు మధ్య విభేదాలు ఉండటంతో ఇద్దరు నాయకులు ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదు. జహీరాబాద్‌లో మంత్రి అజారుద్దీన్ ప్రచారం చేసినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో కేవలం రెండురోజుల మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన సీఎం సహా అగ్రనేతలు ప్రచారానికి రాకపోవడంతో ఆపార్టీ అభ్యర్థులు పార్టీ ముఖ్యనేతల తీరుపై మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో తమకు అండగా నిలవాల్సిన నాయకులు ప్రచారానికి డుమ్మా కొట్టి పార్టీ విజయావకాశాలకు గండికొట్టారని కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నీ తానై మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇస్నాపూర్, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, జహీరాబాద్, కోహీర్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రచారంలో పాల్గొని ఓటర్లను కోరారు.
ఆదివారం ఒక్కరోజే ఆరు మున్సిపాలిటీల్లో 15 ప్రచార సభల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైన తీరు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు పడకేయడం, పట్టణాలకు నిధుల మంజూరు చేయకపోవడం గురించి ప్రజలకు వివరించి చెప్పారు. దీంతో ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు అభ్యర్థులతో కలిసి సోమవారం సాయంత్రం 5గంటల వరకు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, రెండేన్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధిని అటకెక్కించిన తీరును బీఆర్ఎస్ నాయకులు, అభ్యర్థులు ఓటర్లకు వివరించారు. ఆరుగ్యారంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను బాకీ కార్డు ద్వారా బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు తెలియజెప్పారు. బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు, ఓటర్ల నుంచి మంచి స్పందన లభించింది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5గంటలతో తెరపడింది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో సాయంత్రం 5గంటల వరకు ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. చివరిరోజు అభ్యర్థులు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ తమను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో రాజకీయపార్టీలు, అభ్యర్థులు మున్సిపల్ పోలింగ్‌పై దృష్టి పెట్టారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలవైపు నడిపించి ఓటు దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు, అభ్యర్థులు రచిస్తున్నారు.
ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లను దక్కించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేసే పనిలో కాంగ్రెస్ అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలుపొందాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి సైతం పాలుపడుతుంది. పోలీసులను వినియోగించి మున్సిపల్ ఎన్నికలను ప్రభావితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.