Karnataka | బెంగళూరు, డిసెంబర్ 19: ప్రజలపై మరో బాదుడుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలు భారాలు మోపి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సిద్ధరామయ్య సర్కార్ తాజాగా, మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై అదనపు సెస్‌ను విధించనుంది. ఈ మేరకు ప్రభుత్వం కర్ణాటక మోటారు వాహనాల పన్ను చట్టం, 1957ను సవరిస్తూ అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం ఇకపై కొన్న కొత్త ప్రైవేట్ ద్విచక్ర వాహనాలు, కార్లకు రూ.500, 1000 అదనపు సెస్‌ను వసూలు చేస్తారు.
రవాణా రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా డ్రైవర్లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది సుమారు 30 లక్షల మంది ఆధారపడి ఉన్నారని, ఈ క్రమంలో వారి సంక్షేమం కోసం ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశామని రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. వీరికోసం ఖర్చయ్యే నిధులను సమకూర్చడానికి ఇది ఒక శాశ్వత మూలాధారం అవుతుందని చెప్పారు. ఏటా దీని ద్వారా రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని, దీనిని కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు.
వాహనాలపై అదనపు సెస్ విధింపుపై బీజేపీ విమర్శలు చేసింది. ‘ఐదు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు లేక కటకటలాడుతున్నది. దీంతో ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషిస్తూ ప్రజలపై అదనపు భారాలను మోపుతున్నది’ అని ఆరోపించింది. ఇప్పటికే ఇంధనంపై పన్నులను అధికం చేశారు. ఇప్పుడు వాహనాలపై కూడా ఈ ఆదనపు భారం ఎందుకు? ప్రజలను ఇలా పన్నులతో బాధపెట్టడం మానుకోండి అని బీజేపీ నేత అశోక డిమాండ్ చేశారు.
ఐదు గ్యారంటీల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.60,000 కోట్ల భారం పడుతున్నదని బీజేపీ నేత, మాజీ మంత్రి అశ్వత్ నారాయణ పేర్కొన్నారు. కేంద్రం నుంచి కూడా వచ్చే ఆదాయమార్గాలు ఎండిపోవడంతో కొత్తగా ఎలాంటి పన్నులు, భారాలు విధించాలి? అన్న లక్ష్యంతోనే పాలన సాగిస్తున్నదని పేర్కొన్నారు.