Karnataka | బెంగళూరు, జూన్ 19: ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఇతరత్రా వాటిపై పన్నులను పెంచేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం, ప్రజలకు మరో చార్జీల వాత పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో నెలవారీ నీటి బిల్లులను పెంచనున్నట్టు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు నీటి సరఫరా, సీవేజ్ బోర్డు(బీడబ్ల్యూఎస్ఎస్బీ) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని చెప్పుకొచ్చారు. గత పదేండ్లుగా బెంగళూరులో నీటి బిల్లులను పెంచలేదని అన్నారు. కొత్త ప్రాజెక్టులు చేపడుదామనుకొన్నా.. రుణాలు ఇచ్చేందుకు ఏ బ్యాంకు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మరో ఆప్షన్ లేదని, దీనిపై అధికారులకు సూచన చేశానని చెప్పారు.
మూడు రోజుల క్రితం పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను 4 శాతం పెంచడంతో రెండు ఇంధనాల ధరలు లీటర్‌కు రూ.3 చొప్పున పెరిగాయి. రాష్ట్రంలో బస్సు చార్జీలను కూడా పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. బస్సు చార్జీల విషయంపై తాను రవాణా శాఖ అధికారులతో చర్చలు జరుపుతానని సీఎం సిద్ధరామయ్య సోమవారం పేర్కొన్నారు. గత ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్‌ను పెంచేసింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదు గ్యారెంటీల ప్రచారంతో ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. గ్యారెంటీలను అమలు చేయాలంటే ఏటా రూ.52 వేల కోట్ల భారం పడుతుంది. దీంతో గ్యారెంటీల అమలుకు అయ్యే నిధుల కోసం సిద్ధరామయ్య సర్కార్ ఛార్జీల పెంపు, పన్ను వసూళ్లకు తెగబడుతున్నదనే విమర్శలు పెద్దయెత్తున వస్తున్నాయి. ‘ఉచిత విద్యుత్తు’ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీశారని, మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్‌కు కొత్త ఆంక్షలు జోడించారని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్‌లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీమ్‌లోనూ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
చన్నపట్న ఉప ఎన్నిక బరిలో డీకే శివకుమార్ నిలవనున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో పార్టీ, నియోజకవర్గ ప్రజల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బుధవారం చెప్పడం ఆ వార్తలకు బలం చేకూర్చింది. ‘చన్నపట్న నాకు గుండెకాయ వంటిది. నా రాజకీయ జీవితాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించాను’ అని పేర్కొన్నారు. డీకే శివకుమార్ గతంలో ప్రాతినిథ్యం వహించిన సాతనూర్ నియోజకవర్గ పరిధిలో చన్నపట్న ఉండేది. ఇక్కడి నుంచి తాను గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, చన్నపట్న ప్రజలు ఆశీర్వదించారని డీకే పేర్కొన్నారు. జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలువడంతో చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది..
డీకే శివకుమార్ సోదరుడు సురేశ్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు రూరల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు చన్నపట్న నుంచి పోటీచేసి, అక్కడ గెలిస్తే.. డీకే శివకుమార్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కనకపురను సురేశ్ కోసం వదిలేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చన్నపట్న, కనకపుర రెండు కూడా వొక్కలిగ సామాజికవర్గం బలంగా ఉండే రామనగర జిల్లా పరిధిలోకి వస్తాయి.