Parameshwara | బెంగళూరు, నవంబర్ 22: కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ మనుగడపై ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని ఆయన అన్నారు. వీలైనంత తొందరగా కాంగ్రెస్ భవన్ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. శుక్రవారం మైసూరులో జరిగిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరైన భవనం లేదన్న సంగతి సీఎం సిద్ధరామయ్య ఆలస్యంగా గుర్తించినప్పటికీ, భవన నిర్మాణం చేపట్టాలని ఆయన ఆలోచిస్తున్నారని చెప్పారు. ‘పార్టీ కోసం భవనాన్ని నిర్మించాలన్నది మంచి ఆలోచన. వీలైనంత తొందరగా నిర్మాణ పనులు చేపట్టాలి. ఎందుకంటే ముందు ముందు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేం’ అని పరమేశ్వర అన్నారు.