బెంగళూరు, జూన్ 10: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త లోంచి కూడా వేల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నదని విపక్ష బీజేపీ ఆరోపించింది. చెత్త కాంట్రాక్టు ముసుగులో ప్రభుత్వం రూ. 36 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీర్ఘకాలిక వ్యర్థాల నిర్వహణ కాంట్రాక్టు పేరుతో భారీ అక్రమాలకు పాల్పడిందని, బ్లాక్ లిస్టులో పెట్టిన సంస్థకు కాంట్రాక్టు అప్పగించి వేల కోట్ల అక్రమాలకు పాల్పడిందని బీజేపీ సీనియర్ నేత ఆర్ అశోక బుధవారం ఆరోపించారు. గతంలో నిషేధం విధించిన రామ్కీ కంపెనీకి వ్యర్థాల కాంట్రాక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టిందని ఆయన తెలిపారు. ఈ సంస్థను ప్రపంచ బ్యాంకు, బెంగళూరు పౌర సంస్థలు ఇదివరకే నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.