Himachal Pradesh | సిమ్లా, జనవరి 2: గ్యారెంటీల పేరుతో హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పథకాలు అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. ఎన్నికల్లో గెలిస్తే ఖటాఖట్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు పథకాల గుదిబండను మోయలేక కత్తెర్లు పెడుతున్నది. తాజాగా విద్యుత్తు సబ్సిడీలపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. హిమాచల్ ప్రదేశ్‌లో 125 యూనిట్ల వరకు విద్యుత్తు సబ్సిడీ ఇచ్చే పథకం అమలవుతున్నది. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2022లో అధికారం చేపట్టిన ఆ పార్టీ ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. పైగా ఇప్పుడు 125 యూనిట్లకు ఇస్తున్న సబ్సిడీని సైతం ఎత్తేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
సంపన్నులు, పన్ను చెల్లింపుదారుల పేరుతో సబ్సిడీలను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా తన పేరిట ఉన్న ఐదు విద్యుత్తు కనెక్షన్ల సబ్సిడీలను వదులుకుంటున్నట్టు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. సంపన్నులు సైతం సబ్సిడీలు వదులుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ చర్యలపై ఇప్పుడు ప్రతిపక్ష బీజేపీ మండిపడుతున్నది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న సబ్సిడీనే ఎత్తేసేందుకు కాంగ్రెస్ సర్కారు ఈ ఎత్తుగడ వేసిందని ఆరోపిస్తున్నది. హిమాచల్ ప్రదేశ్‌లో హోటళ్లు, పెద్ద వాణిజ్య సంస్థలకు ప్రస్తుతం అందుతున్న వివిధ సబ్సిడీలను ప్రభుత్వం గుర్తించింది. వీటిని సైతం ఎత్తేయాలని నిర్ణయించింది.
10 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్‌ను దివాలా తీయించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల వేతనాలు సైతం సమయానికి ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం చేరుకుం ది. కేంద్రం నుంచి ప్రతినెలా నిధులు వచ్చే వరకు వేతనాలు ఇవ్వలేమని చెప్పిన సీఎం సుఖు.. 1లోపే చెల్లించాల్సిన జీతాలను 5న, పింఛన్లు 10వ తేదీన చెల్లిస్తామని ప్రకటించడం రాష్ట్ర ఆర్థిక స్థితికి అద్దం పడుతున్నది.