PM Modi | న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) అటవీ భూముల్లోని చెట్లను రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి పెకిలించడాన్ని యావత్తూ దేశమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించింది. కాంగ్రెస్ సర్కారు చర్యలపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై స్టే విధించారు. దేశమంతటా తీవ్ర చర్చకు దారితీసిన ఈ ఉదంతంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు నోరువిప్పారు. కంచ గచ్చిబౌలి అడవులను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేయడాన్ని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోమవారం రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ సోమవారం ప్రసంగిస్తూ.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని అన్నారు.
అడవుల్లో బుల్డోజర్లను దింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉన్నదని దుయ్యబట్టారు. చెట్లను నరికేస్తూ.. పర్యావరణానికి హాని చేస్తూ.. మూగజీవాలను కాంగ్రెస్ సర్కారు ప్రమాదంలో పడేస్తోందంటూ మండిపడ్డారు. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ వాళ్లు అడవులను నాశనం చేస్తున్నారంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్షులు, నెమళ్లు, జింకలు వంటి మూగజీవాలకు ఆశ్రయమిస్తున్న 400 ఎకరాల హెచ్సీయూకు చెందిన అడవిని ధ్వంసం చేసి.. ఆ భూములను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు రిజిష్ర్టార్ తన నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో దీనిపై ఈ వారంలోనే సుప్రీంకోర్టు విచారణ జరపనున్నది. ఈ క్రమంలోనే మోదీ ఈ వివాదంపై స్పందించారు.
హెచ్‌సీయూలోని అటవీ భూముల్లో రేవంత్ ప్రభుత్వం కొనసాగించిన విధ్వంసంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఉంటంకిస్తూ ఓ నెటిజన్ ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను ప్రశ్నించాడు. హెచ్‌సీయూ విషయంలో మోదీ నిజంగానే ఆందోళనతో ఉన్నారా? అంటూ సదరు నెటిజన్ గ్రోక్‌ను అడిగాడు. దీనిపై గ్రోక్ తనదైన శైలిలో వాస్తవాలను ప్రస్తావిస్తూ మోదీకి కౌంటర్ ఇచ్చింది. హెచ్‌సీయూలోని అడవిని రేవంత్ ప్రభుత్వం నాశనం చేస్తున్నదన్న మోదీ వ్యాఖ్యలు సరైనవేనని గ్రోక్ ఒప్పుకొంది.
అయితే, మోదీ హయాంలో పర్యావరణ పరిరక్షణ చట్టాలు నిర్వీర్యమైన విధానాన్ని గ్రోక్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అభివృద్ధి పేరిట అండమాన్ నికోబార్ దీవులు, హిమాలయ ప్రాంతాల్లో అడవులను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని పేర్కొంది. హెచ్‌సీయూ వివాదంలో ఒకవైపు చెట్లను రక్షించాలని మోదీ చెప్తూనే.. మరోవైపు పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడింది. దీన్నిబట్టి, మోదీ తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవేనని గ్రోక్ తేల్చి చెప్పింది.