చెన్నై, జూన్ 8: కాంగ్రెస్ ఏర్పాటుచేసే ఏ కూటమిలోనూ తమ పార్టీ భాగం కాబోదని పునరుద్ఘాటిస్తూ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశం ఉందని డీఎంకే సోమవారం సూచించింది. బీజేపీని ఎదుర్కొనడానికి త్వరలోనే ఒక బలమైన, లౌకిక కూటమి ఆవిర్భవించనున్నట్లు వెల్లడించింది. డీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ విలేకరులతో మాట్లాడుతూ ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు లేవనెత్తే జాతీయ ప్రాముఖ్యత గల అంశాలకు తమ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆరోపిస్తూ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్తో కలసి డీఎంకే కనిపించకూడదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో డీఎంకే, ఆప్ మాత్రమే పాల్గొనలేదు. కాంగ్రెస్ కారణంగానే నేటి ఇండియా కూటమి సమావేశంలో తాము పాల్గొనలేదని చెప్పారు. ఎన్నికల ఓటమితో నిరుత్సాహపడే పార్టీ డీఎంకే కాదని, గతంలో తమ పార్టీ ఎన్నో ఎన్నికల్లో గెలిచి, ఓడిపోయిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ మినహా ఇతర విపక్ష పార్టీలతో, అది థర్డ్ ఫ్రంట్ రూపం తీసుకున్నప్పటికీ కలసి పనిచేయడానికి డీఎంకే సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా తెలియచేశాయి.