భోపాల్, ఆగస్టు 7: పేదలను కాంగ్రెస్ వంచించిందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. గత ప్రభుత్వం రోజూ వందసార్లు ‘పేదలు’ అనే మాటను పాటలా పాడేదని, వారి సంక్షేమానికి మాత్రం ఏం చేయలేదని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేఏవై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. గత ప్రభుత్వం పేదలను, గ్రామీణులను రోడ్లు, విద్యుత్తు, ఇండ్లు, వంటగ్యాస్, బ్యాంకింగ్ వంటి కనీస వసతులకు దూరంగా ఉంచిందని, పేదలపట్ల మొసలికన్నీరు కార్చేదని విమర్శించారు. గత ప్రభుత్వ వ్యవస్థలో వైకల్యం ఉండేదన్నారు. తమ ప్రభుత్వ పనితీరుతో పథకాలు అర్హులకు చేరుతున్నాయన్నారు. ప్రస్తుత కరోనా ఆపత్కాలంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిందని చెప్పారు. కరోనావల్ల ఉద్యోగాలు పోయిన ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్దసంఖ్యలో ఉద్యోగాలను కల్పించే నిర్మాణ, మౌలిక వసతుల రంగాల విషయంలో వేగంగా పనిచేస్తున్నామని వివరించారు.