న్యూఢిల్లీ, అక్టోబర్ 9 : హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, దీనిపై దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హర్యానా ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని ఆరోపించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని ఈవీఎంలలో కొన్ని వ్యత్యాసాలు కనుగొన్నామని, అలాంటి ఈవీఎంలను తక్షణం సీల్ చేసి, వాటిని భద్రపర్చి విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ కోరింది. లెక్కింపు సందర్భంగా ఈవీఎంల బ్యాటరీ 99 శాతం సామర్ధ్యంతో ఉండాలని, అయితే చాలా ఈవీఎంలలో 60 నుంచి 70 శాతం బ్యాటరీ సామర్థ్యంతో మాత్రమే పనిచేశాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాగా, ఈవీఎంలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాసింది.