Congress | న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 70 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన ఆ పార్టీ.. కేవలం మూడు స్థానాల్లోనే డిపాజిట్లు దక్కించుకున్నది. 95 శాతం అభ్యర్థుల ధరావతులు గల్లంతయ్యాయి. 2015, 2020 ఎన్నికల్లో సున్నా సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ఈ ఎన్నికల్లోనూ సున్నాతో హ్యాట్రిక్ నమోదు చేసింది. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల్లో 80 శాతం మందికీ డిపాజిట్ దక్కలేదు.
ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆమె ఎల్జీ సక్సేనాకు సమర్పించారని రాజ్‌నివాస్ వర్గాలు వెల్లడించాయి. ఆమె రాజీనామాను ఆమోదించిన సక్సేనా, కొత్త సర్కారు ఏర్పడే వరకు సీఎంగా కొనసాగాలని ఆమెను కోరారు. మరోవైపు గత(ఏడో) ఢిల్లీ శాసనసభను ఫిబ్రవరి 8న రద్దు చేస్తూ ఎల్జీ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తొందరపడటం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించి, తిరిగి వచ్చిన తర్వాతే కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.