Congress Party | ముంబై, నవంబర్ 23: మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అదే సమయంలో జార్ఖండ్‌లో ఇండియా కూటమి భాగస్వామి జేఎంఎం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ రెండు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఇప్పటివరకు కూటముల్లో పెద్దన్నగా వ్యవహరించిన కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్‌లో ఆ స్థానం దక్కకపోవచ్చు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బోల్తా కొట్టింది. నాందేడ్, వయనాడ్ పార్లమెంట్ నియోకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్‌ను సులభంగా నిలబెట్టుకున్న ఆ పార్టీ నాందేడ్‌లో తన సిట్టింగ్ స్థానంలో అతికష్టంగా నెగ్గింది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుంటుందని భావించినప్పటికీ ఈ ఎన్నికల్లో అత్యధికంగా దెబ్బతిన్న పార్టీ కాంగ్రెస్సేనని చెప్పవచ్చు.
ఆ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత బలహీనంగా ఆ పార్టీ పరిస్థితి దిగజారింది. చాలా ఏండ్లుగా సీట్లు తగ్గుతూ వస్తున్న ఆ పార్టీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో 20 లోపు స్థానాలకే పరిమితం అయ్యింది. 288 సీట్లున్న అసెంబ్లీలో ఆ పార్టీ మిగతా కూటమి పార్టీల కన్నా అత్యధికంగా 101 సీట్లలో పోటీ చేసి 16 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అంటే కేవలం 16 శాతం సీట్లలో మాత్రమే ఆ పార్టీ విజయాన్ని సాధించగలిగింది. అదే సమయంలో కూటమి పార్టీలైన ఎన్సీపీ (ఎస్పీ) 86 సీట్లలో పోటీ చేసి 10 సీట్లు నెగ్గి 11.6 విజయం శాతాన్ని, శివసేన (యూబీటీ) 95 సీట్లలో పోటీ చేసి 20 సీట్లతో 20 విజయం శాతాన్ని పొందాయి. అధికార బీజేపీ 149 సీట్లకు 132 స్థానాల్లో విజయం సాధించి 88.6 విజయం శాతాన్ని తెచ్చుకుంది.
గత 34 ఏండ్లుగా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్నడూ సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. 1990లో శరద్ పవార్ నేతృత్వంలో ఆ పార్టీ 141 స్థానాల్లో గెల్చింది. ఆ తర్వాత ఎన్నడూ కూడా ఆ పార్టీకి మూడంకెల సీట్లలో విజయం దక్కలేదు. శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీ పెట్టుకోవడంతో 1995లో కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమై రెండోసారి అధికారానికి దూరమైంది. అప్పటివరకు కాంగ్రెస్‌కు అండగా నిలచిన మరాఠా ఓట్లను ఎన్సీపీ చీల్చింది.
ఆ తర్వాత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో పార్టీ పుంజుకోకున్నా ఎన్సీపీతో పొత్తుతో అధికారం చేపట్టింది. 2008లో ముంబై దాడుల నేపథ్యంలో విలాస్‌రావు పదవిని కోల్పోయారు. 2009లో అశోక్ చవాన్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ 82 సీట్లను గెల్చుకుంది. 2014లో మోదీ హవా, కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలతో 42 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఆ పార్టీ తేరుకోలేదు. ఈ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. పరిస్థితి మరింత దిగజారి ఆ పార్టీకి 20 లోపే సీట్లు వచ్చాయి.
కాంగ్రెస్, దాని కూటమి పార్టీల పరాజయ ప్రభావం రాజ్యసభ ఎన్నికల్లోనూ చూపించవచ్చు. అదే సమయంలో ఎగువ సభలో అధికార బీజేపీ పూర్తి మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నది. రాజ్యసభలో కూడా బీజేపీ పూర్తి మెజారిటీ పొందితే ఇక బిల్లుల ఆమోదంలో ఆ పార్టీకి ఎదురు ఉండకపోవవచ్చు.
ఎన్నిక ఎన్నికకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూ వస్తున్నది. ఆ పార్టీ వ్యూహాలు వరుసగా విఫలమవుతూ వస్తున్నాయి. అది ఇస్తున్న గ్యారంటీలపై ప్రజలకు భ్రమలు తొలగాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టిన అలవికాని హామీలే. ఈ విఫల ఉచిత హామీలపై హర్యానా ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేయడంతో ఓటర్లు తేరుకుని కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేశారు. దానికి తోడు పార్టీలోని నేతలు తమ పార్టీ విజయం కన్నా సీఎం పదవిపై మక్కువతోనే పనిచేయడంతో ఆ పార్టీకి మరోసారి అపజయం తప్పలేదు.
జమ్ముకశ్మీర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ది ఇదే పరిస్థితి. దాని కూటమి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) అధికారం చేజిక్కించుకుంది. పూర్తి మెజారిటీ రావడంతో కాంగ్రెస్ అవసరం ఆ పార్టీకి లేకుండా పోయింది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా కుల గణన, అదానీ-అంబానీల అంశాలే ప్రస్తావించారని, ఇది ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదనివిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.