Congress | న్యూఢిల్లీ, జనవరి 29: ఉచిత బస్సు ప్రయాణం హామీతో మహిళల ఓట్లను ఆకర్షించవచ్చనే వ్యూహాన్ని కాంగ్రెస్ మార్చుకుంది. ఢిల్లీ ఎన్నికల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు ఉచిత బస్సు హామీని మాత్రం ఇవ్వలేదు. కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ ఢిల్లీలో ఈ హామీ ఇవ్వలేదని తెలుస్తున్నది.
ఉచిత బస్సు పథకం వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ కంటే వ్యతిరేకతే ఎక్కువ అనే అభిప్రాయాలు ఉన్నాయి. పైగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆర్టీసీలకు చెల్లించలేకపోతున్నాయి. దీంతో ఆర్టీసీలు సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు హామీని వదిలేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది.